జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి' వాహనం గురించి చర్చ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ ఎన్నికల ప్రచారం కోసం 'వారాహి' వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనం ఆలివ్ గ్రీన్‌లో మిలటరీ వాహనాన్ని పోలి ఉండడంతో, రవాణా చట్టానికి లోబడి ఉందా లేదా అనే విషయంపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. మిలటరీ చట్టం, ఆర్మీ ప్రోటోకాల్‌పై కనీస అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
ఇక పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ ఏర్పాటు చేసుకున్నది వారాహి వాహనం కాదని... అది నారాహి వాహనమని అన్నారు. ఎవరితో యుద్ధం చేయాలో కూడా పవన్ కు అర్థం కావడం లేదని.. కత్తులు పట్టుకుని పిచ్చిపిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరికాదని అన్నారు. ఆలివ్ గ్రీన్ కలర్ ను ఆర్మీ వాళ్లు మాత్రమే వాడాలనే నిబంధన ఉందని... పవన్ కళ్యాణ్ వాహనానికి ఆ రంగు ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని స్థితిలో జనసేన ఉందని రోజా ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఉన్న పవన్ శ్వాస తీసుకోవాలా? వద్దా? అని చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని అన్నారు. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పని చేస్తున్నాడని.. పవన్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, సొంత పార్టీపైనా ప్రేమ లేదని రోజా అన్నారు.