పవన్ రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్ట్
Minister Jogi Ramesh Fire On Pawan Kalyan. జగనన్న కాలనీలపై పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం
By Medi Samrat
జగనన్న కాలనీలపై పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తిరగబడటంతో ఏం చేయాలో పవన్‌కు తెలియడం లేదు. లబ్ధిదారులే జనసేన నేతలకు బుద్ధి చెబుతున్నారని అన్నారు. పవన్ రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రభుత్వంపై పవన్ కు కడుపు మంట అని దుయ్యబట్టారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ జరగని ఇళ్ల నిర్మాణం ఏపీలో జరుగుతోంది. ఏపీలో గృహ యజ్ఞం జరుగుతోంది. పేదలకు ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో రగిలిపోతున్నాయని విమర్శించారు.
జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. దుర్మార్గంగా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. ఒక్క ఇళ్లైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా.. ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును ప్రశ్నించావా పవన్..? అని నిలదీశారు. 2014 మేనిఫెస్టోలో 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు..? చంద్రబాబు చొక్కా ఆనాడు ఎందుకు పట్టుకోలేదు పవన్..? అని ప్రశ్నించారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలం ఇచ్చాం. 21 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం చేస్తు న్నాం. మమ్మల్ని నువ్వా ప్రశ్నించేది పవన్..? అంటూ మండిపడ్డారు.
పిల్ల సైకోలను పోగేసి మీటింగ్ పెట్టి గోల చేస్తావా..? పిల్ల సైకోలు పవన్‌ను ప్రశ్నించాలని సూచించారు. భారత దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 21 లక్షల ఇళ్లు కట్టిస్తున్నారా..? భారత ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంది. పాదయాత్రలో పేదల కష్టాలు చూసిన జగనన్న.. అక్కచెల్లెమ్మల కల నెరవేరుస్తున్నాడని పేర్కొన్నారు. రా.. పవన్ కల్యాణ్ దమ్ముంటే రా.. నిన్ను నిలదీస్తున్నారా..? మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారా..? నీవు రా.. నిజాలు తెలుస్తాయంటూ సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ ఏంటీ నీవు కూల్చేది.. ఒక్క అడుగుతో మొదలై.. లక్షలాది అడుగులతో.. కోట్లాది హృదయాల్లో నిలిచిపోయారు జగన్. నీవు కాదు కదా.. నీ దత్తతండ్రి వచ్చినా ఇంచు కూడా.. జగన్ ప్రభుత్వాన్ని కదిలించలేరని అన్నారు. ఏపీలో సంక్షేమ పాలన చూసి.. పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నాడని అన్నారు. పవన కల్యాణ్, చంద్రబాబు రాక్షష క్రీడ ఆడుతున్నారు. శాంతిభ్రదతలకు భంగం వారే కలిగిస్తారు. వారే ప్రభుత్వం మీద నిందలు వేస్తారని ఫైర్ అయ్యారు.