డిబేట్‌కు ఎవరు వస్తారో రండి.. మేం సిద్ధంగా ఉన్నాం
Minister Botsa Satyanarayana Fire on Chandrababu. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు
By Medi Samrat Published on 18 Jun 2022 2:10 PM ISTఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి పనికిమాలిన నేత ఉన్నారా..? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓ పనికిమాలిన వ్యక్తి.. ఆయనకు మతిస్థిమితం పోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు కొడుకు, ఆయన మనవడు ఇంగ్లిష్ చదువులు చదవాలి..పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదవకూడదా..? అని ప్రశ్నించారు. తప్పుడు విమర్శలకే చంద్రబాబు పరిమితమయ్యారని తప్పుబట్టారు. బైజూస్ సంస్థ గురించి చంద్రబాబుకు ఏం తెలుసు..? అని ప్రశ్నించారు. కోట్ల మంది విద్యార్థులు బైజూస్‌ను ఉపయోగిస్తున్నారని.. పేద విద్యార్థులు మంచి చదువులు చదువుతుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. బైజూస్‌తో ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా ..? అని నిలదీశారు.
బైజౌస్‌పై చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం విడ్డూరం అని అన్నారు. అనుభవం ఉంటే సరిపోదని.. నలుగురికి ఉపయోగపడాలని అన్నారు. 35 లక్షల మంది విద్యార్దులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. ఒక్కో విద్యార్థికి రూ.20వేలు విలువ చేసే కంటెంట్ బైజూస్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బైజూస్ ఎంతో ఉపయోగకరం అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందిందని.. మా గురించి తెలియడం వల్లనే ప్రజలు ఆదరిస్తున్నారని బొత్స అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. సీఎం వైఎస్ జగన్ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నారని తెలిపారు. డిబేట్‌కు ఎవరు వస్తారో రండి.. మేం సిద్ధంగా ఉన్నాం.. చంద్రబాబులా మేం ప్రభుత్వ పాఠశాలలు మూసేయలేదని.. నాడు - నేడు లాంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.