చంద్రబాబు మోసం చేస్తే.. సీఎం జగన్ అన్నలా ఆదుకుంటున్నారు
Minister Anil Kumar Fires On Chandrababu. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని.. జగన్ అన్నలా ఆదుకుంటున్నారని
By Medi Samrat Published on 12 Oct 2021 5:04 PM ISTడ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని.. జగన్ అన్నలా ఆదుకుంటున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రూ. 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన బాబు.. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే రూ. 12,759 కోట్లతో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళా సాధికారత, స్వావలంబనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. చంద్రబాబుది హైదరాబాద్ లో నివాసం.. ఆంధ్రాలో రాజకీయం అంటూ విమర్శలు గుప్పించారు. పేదల ఇళ్ళ నిర్మాణాలను అడ్డుకుంటున్న బాబును ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించవు..? అని నిలదీశారు.
పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలను ఓ అన్నలా ఆదుకుంటున్నారు. దాదాపు 78.76 లక్షల మహిళలు లబ్ది పొందేలా రెండవ విడత సాయంగా రూ. 6,440 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని లక్షల మంది అక్కచెల్లెమ్మలను మోసం చేశారు.
చంద్రబాబు హయాంలో రూ.14వేల కోట్లు ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మల బకాయిలు 2019 నాటికి రూ.25,517 కోట్లకు చేరాయి. సీఎం జగన్ తన పాదయాత్రలో అక్కచెల్లెమ్మల బాధలు చూసి నాలుగు విడతలుగా వడ్డీతో సహా బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే ఇప్పటికి రెండు విడతలుగా రూ.12,759 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు, జగన్ మోహన్ రెడ్డికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ ఒక్క అంశం చూసినా అర్థం అవుతుందని మంత్రి అనిల్ అన్నారు.