విజయవాడ పోరంకిలో టీడీపీ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబునాయుడుకు మాత్రం లేదని అన్నారు. గొప్ప రజనీకాంత్ గారు ఇవాళ విజయవాడ వచ్చారని.. గతంలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలను, ఆయనపై వచ్చిన పుస్తకాలను రజనీకాంత్ ఈ శతజయంతి కార్యక్రమంలో ఆవిష్కరిస్తారని నేను విన్నానన్నారు అంబటి. రజనీకాంత్ రాజకీయాలకు అతీతంగా, ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమానికి వచ్చారని భావిస్తున్నాను. లేకపోతే, ఎన్టీఆర్ తో కలిసి నటించానన్న భావనతోనో రజనీకాంత్ ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అనుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ వంటి వ్యక్తికి శతజయంతి ఉత్సవాలు జరపడం తెలుగువారందరికీ హర్షణీయమైన విషయమే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబునాయుడుకు మాత్రం లేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నానని అంబటి రాంబాబు అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం విజయవాడకు చేరుకున్నారు. దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ జరగనుంది. ఈ సభలో చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు.