Budget Session: వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ -2023 సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభంకాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం
By అంజి Published on 15 March 2023 12:30 PM IST
వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ -2023 సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభంకాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. మరోవైపు టీడీపీ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్‌లో సభ్యులు మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. శ్రీధర్ రెడ్డి నిరసనను, ప్రభుత్వం, తాను కూడా గుర్తించామని స్పీకర్ అన్నారు.
కానీ, ఇలా చేయడం తగదు, కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుందని స్పీకర్ తమ్మినేని చెప్పినా కోటంరెడ్డి అలానే నిల్చుండిపోయారు. ఈ క్రమంలోనే సభకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. సభను అడ్డుకునేందుకే కోటంరెడ్డి వచ్చారని, శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ ఇప్పుడు ప్రేమ వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. కోటంరెడ్డి నమ్మకద్రోహి, టీడీపీ, చంద్రబాబు కోసం పని చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. నైతిక విలువలు లేని కోటంరెడ్డి.. చంద్రబాబు మెప్పు కోసం మాట్లాడుతున్నాడని అన్నారు. నమ్మకద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయని అంబటి అన్నారు.
ఏపీ అసెంబ్లీ రెండోవ రోజు సమావేశాలు ప్రారంభంకోటం రెడ్డి నమ్మక ద్రోహిడు- మంత్రి అంబటి రాంబాబు #APAssembly pic.twitter.com/nkKGkQWugr
— Rahul (@2024YCP) March 15, 2023
ఆ తర్వాత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సభలో వ్యక్తిగత అంశాలకు చోటు లేదని అన్నారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తామన్నారు. ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని మంత్రి బుగ్గున హితవు పలికారు. ఇంతలోనే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై స్పీకర్ తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే వినతిపత్రం నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలని అన్నారు. సభలో ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.