ఈనాడు పత్రిక వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతోందని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం పునరావసం పనులు రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలని ఈనాడు రాసిందని.. ఏదో జరిగిపోతుంది అన్నట్లు నెమ్మదిగా ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈనాడు వాస్తవాలు తెలుసుకుని రాయాలని సూచించారు. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.
ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరు, దశల వారీగా పని చేస్తారని అన్నారు. 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారు. అక్కడి వరకు ఉన్నవారికి మొదట పునరావాసం కల్పిస్తారని తెలిపారు. రూ.800 కోట్లు మళ్లీ ఖర్చు పెట్టడానికి కారణం చంద్రబాబు కాదా..? ఈ విషయం ఈనాడు ఎందుకు రాయదు..? అని ప్రశ్నించారు. త్వరగా అయిపోయే పనులు చేసి చంద్రబాబు కమీషన్లు కొట్టేశారని.. చంద్రబాబు స్పిల్ వే కట్టకుండా కాఫర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశారని ఆరోపించారు.
కాఫర్ డ్యాం వరదలకు కొట్టుకుపోయింది.. డయాప్రం వాల్ సైతం కొట్టుకుపోయిందని.. ఇప్పుడు మళ్లీ కట్టాల్సి వచ్చిందని.. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మొదటిసారి జరిగిందని.. ఈ విషయాలు ఈనాడు ఎందుకు రాయదు..? అని మంత్రి ఫైర్ అయ్యారు. జగన్ సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పోలవరం పనులు చేస్తున్నారని.. కానీ...ఎల్లో మీడియాకు ఇవేమీ పట్టడం లేదని విమర్శించారు. పునరావాస కాలనీలు బాగున్నాయని స్వయంగా కేంద్ర మంత్రే ప్రకటించారని.. బాధితులకు నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు వేసేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.