175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా.? : మంత్రి అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 16 Dec 2023 9:15 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మూడుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసే అవకాశాన్ని ఆయనకు ప్రజలిచ్చారు. మరి, నిజంగా ఆయన ప్రజలకు ఉపయోగపడిన పరిపాలన అద్భుతంగా చేసి ఉన్నట్లయితే, వారి కాలంలో వారిని నిజంగా ప్రజలు మెచ్చుకుని ఉంటే.. మీరు రేపటి ఎన్నికల్లో సింగిల్‌గా ఎందుకు పోటీ చేయలేక పోతున్నారు? అని ప్రశ్నించారు. తాను 14 ఏళ్లపాటు సీఎంగా ఎలా పని చేశానో.. మళ్లీ అలాంటి పరిపాలన చూపిస్తానని ప్రజలకు ఎందుకు చెప్పలేక పోతున్నారు? అని నిలదీశారు.
సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్‌గా పోటీ చేసి మొత్తం 175 సీట్లు గెలుస్తామని ధైర్యంగా చెబుతుంటే.. మీరెందుకు గుంపులు గుంపులుగా కలిసి పోటీకి దిగుతున్నారు? ఎందుకు జనసేన, పవన్‌కళ్యాణ్‌ను వెంట బెట్టుకుని రావాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?. అని అడిగారు. వైఎస్‌ఆర్‌సీపీ పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ వారి పార్టీ సభల్లో బీరాలు పలుకుతున్నారు కదా.? 151 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని మార్చినా వైఎస్‌ఆర్‌సీపీ గెలవబోదని కోతలు కోస్తున్నారు కదా.! మరి మీ బాబూ కొడుకులకు నేనొక సవాల్ విసురుతున్నాను. దాన్ని స్వీకరించి 175 స్థానాల్లో మీరు సింగిల్‌గా పోటీ చేయండి. జగన్‌ని ఓడిస్తామని చెప్పే ధైర్యం లేదు కానీ.. పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ నానాటికీ దిగజారిపోతున్నారని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుని వేల కోట్లు పోగేసుకున్న చంద్రబాబు, ఆ తర్వాత ఆధారాలతో సహా దొరికి విధి లేని పరిస్థితిల్లో జైలుకెళ్లాడన్న సంగతి అందరికీ తెలిసిందే. 53 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత ఆయన రోగాల వల్లనో హెల్త్‌గ్రౌండ్ వల్లనో బెయిల్ పొంది బయటకొచ్చారు. ఆ తర్వాత పలు దేవాలయాల్లో మొక్కులు తీర్చుకుని.. ఇప్పుడు పక్కా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి విమర్శలు చేస్తూ.. బరి తెగించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని ఏదేదో చేస్తానంటూ.. లోక కళ్యాణానికే టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నట్లు తనకు తాను వివరణ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మా పార్టీ అంతర్గతంగా సీట్ల సర్దుబాటు చేసుకోవడాన్ని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఆయన జైలుకెళ్లడం వల్లనో.. లేదంటే, ఆయన వయసురీత్యానో గతి, మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోందని విమర్శించారు.