స్నేహితుడి పెళ్లి కోసం క్రాకర్స్ తయారు చేస్తుండగా పేలుడు.. వ్య‌క్తి మృతి

Man dies in explosion while making firecrackers in Srikakulam. శ్రీకాకుళంలోని రణస్థలం మండల కేంద్రంలోని జేఆర్ పురం పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  20 April 2022 8:38 AM GMT
స్నేహితుడి పెళ్లి కోసం క్రాకర్స్ తయారు చేస్తుండగా పేలుడు.. వ్య‌క్తి మృతి

శ్రీకాకుళంలోని రణస్థలం మండల కేంద్రంలోని జేఆర్ పురం పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ కాలనీలో స్నేహితుడి పెళ్లి కోసం క్రాకర్స్ తయారు చేస్తుండగా పేలుడు సంభవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెండ్స్ కాలనీకి చెందిన కామరాజ్ (39) కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లావేరు మండలం వేణుగోపాలపురంలో తన స్నేహితుడి పెళ్లికి బాణాసంచా తయారీకి సంబంధించిన సామాగ్రి అంతా తీసుకొచ్చాడు.

మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో కామరాజ్ బాణాసంచా తయారు చేస్తుండగా.. చేతిలో పేలుడు సంభవించింది. పక్కనే నిల్వ ఉంచిన బాణాసంచాపై మంటలు చెలరేగడంతో రేకు షెడ్డులో పెద్ద శబ్ధంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కామరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు తీగకు కూడా మంటలు రావడంతో స్థానికులు బయటకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించగా.. జేఆర్ పురం సీఐ బీసీహెచ్ స్వామినాయుడుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామరాజు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ జి.రాజేష్ తెలిపారు. కామరాజు 20 ఏళ్ల క్రితం స్వగ్రామం వేణుగోపాలపురం నుంచి జేఆర్‌పురం వచ్చి తన అన్న కృష్ణతో కలిసి కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.

జేఆర్ పురంలో పేలుడులో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో సీఐ అంబేద్కర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు విజయకుమార్, రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం 19 చోట్ల సోదాలు నిర్వహించగా ఐదు చోట్ల మందుగుండు సామాగ్రి, పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరసవల్లి ర్యాలీ వీధి, ఆదిత్యనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పలాస-కాశీబుగ్గలోనూ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
















Next Story