ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తూ వస్తోంది. లక్షలాది కుటుంబాలు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తీసుకుంటున్నాయి. ఇంకొంత మంది అర్హులు కూడా ప్రభుత్వ పథకాల కోసం అప్ప్లై చేసుకుంటూ ఉన్నారు. ఈ ఏడాది కాకపోయినా, వచ్చే ఏడాది అయినా ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎదురుచూస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త కలకలం రేపుతోంది.
తక్కెళ్లపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని జాన్ అనే వ్యక్తి వార్డు వాలంటీర్ చిరంజీవిని అడుగుతూ ఉన్నాడు. చిరంజీవి జాన్ అభ్యర్థనలను పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి. ఆ ఘర్షణ కాస్తా పోలీసు కేసు వరకు వెళ్లింది. ఇటీవల జాన్ తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. సమీపంలోని తోటలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న వార్డు వాలంటీర్ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.