నన్ను అరెస్టు చేయండి : బీజేపీకి మమతా సవాల్
Mamata's challenge to BJP as corruption claims fly. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేతృత్వంలోని ప్రభుత్వంపై
By Medi Samrat Published on 29 Aug 2022 5:37 PM ISTపశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీలైతే నన్ను అరెస్టు చేయండని సవాలు చేశారు. పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో, పశువుల స్మగ్లింగ్ కేసులో పార్థ ఛటర్జీ, అనుబ్రత మోండల్ అరెస్టయిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు సవాల్ విసిరారు.
కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ర్యాలీకి హాజరైన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తనపై, కోల్‌కతా మేయర్, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఇతర టీఎంసీ అనుభవజ్ఞులపై దురుద్దేశపూరితమైన ప్రచారం జరిగిందని అన్నారు.
బీజేపీ అందరినీ దొంగలుగా ముద్ర వేస్తోంది. టీఎంసీలో మేమంతా దొంగలమని, బీజేపీ, ఆ పార్టీ నేతలు మాత్రమే పవిత్రులమంటూ ఓ విధంగా ప్రచారం చేస్తున్నారు. నేను రాజకీయాల్లో లేకుంటే వారి నాలుకను చీరేసేదానిని' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఎన్నుకోబడిన కాషాయ రహిత ప్రభుత్వాలను గద్దె దించేందుకు బిజెపి తన "అక్రమ డబ్బు"తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు.
ఫిర్హాద్ హకీమ్‌ను ఇటీవల కేంద్ర ఏజెన్సీలు పిలిచాయి. ఈ నేపథ్యంలో హకీమ్‌ను తదుపరి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. "హకీమ్ అరెస్టు చేయబడితే, ఆయనను వేధించడం కోసమే ఫేక్ కేసు నమోదు చేసినట్లు మీరు నిశ్చయించుకోవచ్చు" అని బెనర్జీ అన్నారు.
మహారాష్ట్ర తరహాలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వేల కోట్లు ఎక్కడి నుంచి అందుతున్నాయో సమాధానం చెప్పాలని ఆమె బీజేపీని డిమాండ్ చేశారు.