చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కొడాలి నాని
Kodali Nani Fire On Chandrababu. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. అందుకే పిచ్చి వాగుడు వాగుతున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని
By Medi Samrat Published on 9 Sep 2022 2:45 PM GMTచంద్రబాబుకు మతి భ్రమించిందని.. అందుకే పిచ్చి వాగుడు వాగుతున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ను తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహా నగరాలతో అమరావతిని పోలుస్తున్నారని.. సొల్లు కబుర్లతో ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
అమరావతి మీద ఒక పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ, దాని తోక పార్టీలు ఆవిష్కరించాయని విమర్శించారు. హైదరాబాద్‌ను తానే కట్టానని, తాను మొదలు పెట్టిన వాటిని ఎవరూ ఆపలేదని ఆ సమావేశంలో చంద్రబాబు అన్నారు. పిచ్చి పరాకాష్టకు చేరింది. హైదరాబాద్‌ను చంద్రబాబు నిర్మించడం మొదలు పెట్టారా? ఆయన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, 1995 సెప్టెంబరు 1న సీఎం అయినప్పుడు హైదరాబాద్ నగరం లేదా? ఆయన నగర నిర్మాణం మొదలు పెట్టడం ఏమిటి? దాన్ని వైయస్సార్ పూర్తి చేయడం ఏమిటి? చంద్రబాబుకు కనీసం సిగ్గు శరం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను భూసేకరణ చేస్తే, వైయస్సార్ దాన్ని కట్టాడని చంద్రబాబు అన్నాడు. నిజానికి ముఖ్య నగరాల శివార్లలో పెద్ద విమానాశ్రయాలు నిర్మించాలని నిర్ణయించిన కేంద్రం, ఆనాడు భూసేకరణ చేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాయి.
మరి ఇక్కడ చంద్రబాబు భూసేకరణ చేస్తే, బెంగళూరు, చెన్నైలో కూడా ఆయనే సేకరించాడా? అన్నీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబుకు మతి పూర్తిగా భ్రమించింది. ఒకడే ఒకడు సినిమా డైరెక్టర్ కూడా తనను స్ఫూర్తిగా సినిమా తీశాడని పిచ్చి వాడిలా అన్నాడు. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెబుతాడు. చంద్రబాబుకు మతి భ్రమించి పిచ్చి వాగుడు వాగుతున్నాడని ఫైర్ అయ్యారు.
అమరావతిలో జగన్, చంద్రబాబు ప్రచారం చేసిన గ్రాఫిక్స్‌ను కంటిన్యూ చేయాలా? నీ మాదిరిగా రెండేళ్లకోసారి గ్రాఫిక్స్ మారుస్తూ చూపాలా? నీ వారసుడిగా ఆయన ఆ పని చేయాలా? చంద్రబాబుకు పిచ్చి ఎక్కి, పిట్టలదొరగా మారి, ప్రజలను మోసం చేసి, అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచి, ఈ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి, మరోసారి మోసం చేయొచ్చన్న దురాలచనతో మళ్లీ అధికారం పొందొచ్చు అని 2019 ఎన్నికల్లోకి వస్తే, ఆయన ఒక మోసగాడని ప్రజలు తేల్చి చెప్పారని అన్నారు.
అమరావతిని మహా నగరం కింద దేశంలో అన్ని ముఖ్య నగరాలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై. హైదరాబాద్‌లను దాటించి, మొదటి స్థానంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నించానని చంద్రబాబు అంటున్నారు.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న మహానగరాలు అప్పటి మద్రాస్, బాంబే, కలకత్తానే కదా. ఢిల్లీ రాజధానిగా ఎదిగిన తర్వాత అది పెద్ద నగరంగా నిల్చింది. ఆ తర్వాత మిగిలిన నగరాలు నిల్చాయి. హైదరాబాద్ కూడా ఒక మహానగరంగా నిల్చింది. దేశంలో 29 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 75 ఏళ్ల తర్వాత కూడా, అంతకు ముందు కూడా 5 ముఖ్య నగరాలు కాకుండా, ఏ నగరం ఆ స్థాయికి ఎదిగిందో చెప్పండని ప్రశ్నించారు.
చంద్రబాబు గ్రాఫిక్స్ చూపి, అమరావతి రైతులకు ఆశలు చూపి, ఆశల పల్లకి ఎక్కించి, మంచి పంటలు పండే భూములను తీసుకున్నాడు. వారిని మభ్య పెట్టాడు. అందుకు హైదరాబాద్, సైబరాబాద్, కోకాపేట అంటూ ఏవేవో కబుర్లు చెప్పాడు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పి, ఇక్కడి రైతుల పొలాలు తీసుకుని వారిని మభ్య పెట్టాడని విమర్శించారు.