అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై విమర్శలు కురిపించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని.. పవన్ కల్యాణ్‌ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక అని ఎలా చెప్తారు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా..? అని ప్రశ్నించారు.
ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జయహో బీసీ సదస్సు జరిగింది. టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని… జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్టు చంద్రబాబు వివరించారు.