ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఏనుగులను ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కర్ణాటక ప్రభుత్వం నో చెప్పింది. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే రాష్ట్ర అటవీ శాఖకు ఏనుగులను సరఫరా చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. కర్ణాటక ఏనుగుల సంరక్షణ, శ్రేయస్సుపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ నిర్ణయం వచ్చింది.
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఖండ్రే.. కర్ణాటకలో ఏనుగుల సంఖ్యను పెంచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మన ఏనుగుల భద్రత, శ్రేయస్సును చూసుకునే బాధ్యత మనపైనే ఉంది. వాటి ఆవాసాల పరిరక్షణ, మానవ-ఏనుగుల సంఘర్షణకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఈ సమయంలో ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
ఏనుగులను ఏపీలోని పలు ప్రాంతాల్లో అడవుల గస్తీకి సహకరించాలని, వివిధ వేడుకల్లో పాల్గొనేలా చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకను సంప్రదించింది. రాష్ట్ర అటవీ వనరులు, వన్యప్రాణుల నిర్వహణలో శిక్షణ పొందిన ఏనుగుల అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో మైసూరు, కొడగు, బన్నెరఘట్ట ప్రాంతాలలో గణనీయమైన సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. వీటిని రక్షించడానికి కర్ణాటక రాష్ట్రం వివిధ పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టింది.