హరిరామ జోగయ్య మరో లేఖ
కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిపి లేఖ రాశారు
By Medi Samrat Published on 27 July 2024 8:57 PM ISTకాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిపి లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ అంశంమై ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చేగొండి హరి రామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని.. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటిషన్ సైతం వేసిందన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య తెలిపారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసిందని హరిరామ జోగయ్య తెలిపారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి.