స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎప్పుడు వింటామనేది కూడా.. మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.