ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన జవాద్ తుఫాను మరింత బలపడుతోంది. ఇది విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 200 కి.మీ దూరంలో జవాద్ తుఫాను కేంద్రీకృతమూంది. రేపు మధ్యాహ్నం తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే విద్యా సంస్ధలకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో ఇవాళ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1,735 సహాయక బృందాలను పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటుచేసింది. వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో అధికారులు హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడే ఛాన్స్ ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలపై పడనుంది. తీరం వెంబడి భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 95కుపైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.