సీఎం జగన్‌కు జనసేనాని బహిరంగ లేఖ
Janasena Pawan Kalyan Letter to CM Jagan. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
By Medi Samrat
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఏపీలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ల సంఖ్యను తగ్గించుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లేఖలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులు పేదలను ఇబ్బందుల పాలు చేసేవిగా ఉన్నాయని తెలిపారు. పెన్షన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారు 4 లక్షల మంది లబ్దిదారులకు నోటీసులు జారీ చేశారని, పేదలైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇప్పటివరకు పొందుతున్న పెన్షన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పెన్షన్ తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సరిగా లేవని విమర్శించారు. విద్యుత్ బిల్లు ఎక్కువైందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో లబ్దిని రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. పది పదిహేనేళ్లకు ముందు నుంచి పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను ఇప్పుడు చూపించాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారని అన్నారు జనసేనాని. పెన్షన్ల రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితులను సరిదిద్దాల్సి ఉందని అన్నారు. కాలం గడిచే కొద్దీ పెన్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలి తప్ప, పెన్షన్ సొమ్ము పెంచుతున్నాం కాబట్టి లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకోవాలని అనుకోవడం సరికాదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.