రూ.10వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ మూడింతలు ఖర్చు అవుతుంది
Janasena Leader Nadendla Manohar Fires On Govt. జనసేన రాష్ట్ర నేతలతో ఆ పార్టీ ముఖ్య నాయకులు, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం
By Medi Samrat Published on 27 Aug 2021 7:03 AM GMTజనసేన రాష్ట్ర నేతలతో ఆ పార్టీ ముఖ్య నాయకులు, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణపై చర్చ జరిగింది. సమావేశంలో JSP for AP ROADS పేరుతో రోడ్ల పరిశీలన పోస్టర్ ని నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదని అన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా పాలన సాగిస్తున్నారని.. లక్షా 26 వేల కిలో మీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బ తిన్నాయని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సర్కార్‌లో చలనం లేదని ఫైర్ అయ్యారు.
రూ. 12, 450కోట్ల రూపాయలు రహదారులు బాగు కోసం కేటాయించామని.. రూ. 1340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. మరి పనులు ఎక్కడ.. కాంట్రాక్టర్ లు ఏరి..? అని ప్రశ్నించారు. రోడ్ల బాగుపై ప్రభుత్వం చేసిందంతా.. పెద్ద స్కాం గా మేము అనుమానిస్తున్నామని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్నా.. గోతుల రోడ్లు కనిపించడం లేదా అని మండిపడ్డారు. వాహన మిత్ర స్కీం పెట్టి.. పదివేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బ తిని.. మూడింతలు ఖర్చు అవుతుందని ఎద్దేవా చేశారు.
3,600 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేశారన్నారు.. మరి ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎందుకు పాదయాత్ర చేయరని అని ప్రశ్నించారు. దెబ్బ తిన్న రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత లేదా.. ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం ముందుకు వెళుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మా కార్యకర్త ప్లకార్డు చేతబడితే కేసులు పెట్టారని.. రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని అన్నారు.
సెప్టెంబరు 2, 3, 4 తేదీలలో ఈ వీడియో లు అందరికీ ప్రదర్శిస్తామని.. ఆ తరువాత ప్రభుత్వం స్పందనకై నెల రోజుల పాటు వేచి చూస్తామని.. అక్టోబర్ 2వ తేదీ నుండి జనసేన అధ్యక్షుడు నుంచి జన సైనికుల వరకు అందరూ రోడ్లను శ్రమదానంతో బాగు చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు ఉంటాయని.. ఈ కార్యక్రమం ద్వారా రోడ్లను పరిశీలించి ప్రజలకు చూపిస్తామని తెలిపారు. బీజేపీ, జనసేన కలిసే పని చేస్తాయని.. అభిప్రాయ బేధాలు ఉండోచ్చు.. కానీ.. అంతరాలు లేవని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.