అధ్వాన్నపు రహదారులపై లక్షల కొద్దీ ట్వీట్స్

Janasena For Roads. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో రహదారుల పరిస్థితిని

By Medi Samrat  Published on  3 Sep 2021 4:08 PM GMT
అధ్వాన్నపు రహదారులపై లక్షల కొద్దీ ట్వీట్స్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో రహదారుల పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో చేపట్టిన ఈ ఉద్యమంలో వేల మంది పాల్గొని తమ ప్రాంతాల్లోని రోడ్లు ఏ విధంగా పాడైపోయి.. ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయి తెలియచేస్తున్నారు. లక్షల మంది ఈ ఉద్యమాన్ని సామాజిక మాద్యమాల ద్వారా పరిశీలిస్తూ, రహదారుల దుస్థితిని తెలుసుకొంటున్నారు. ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. గురువారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం శనివారం వరకూ సాగుతుంది. తొలి రెండు రోజుల్లో ట్విటర్ లో #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో 1,73,500 ట్వీట్స్ వచ్చాయి.

వీటి ద్వారా అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకూ అన్ని ప్రాంతాల ప్రజలు తమ ఊళ్లలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియపరిచారు. 4,88,700 మేరకు ట్విట్టర్ ఎంగేజ్మెంట్ నమోదైంది. ఈ డిజిటల్ ఉద్యమం రెండు రోజుల్లో 192.9 మిలియన్ల ట్విట్టర్ యూజర్స్ కు రీచ్ అయింది. ఈ ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానానికి చేరింది. అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని.. గుంతల మధ్య ఉన్న రోడ్డుపై ఏ విధంగా ప్రయాణం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


Next Story