అనంత‌పురం జిల్లాలో నేడు పవ‌న్ ప‌ర్య‌ట‌న‌

Janasena Chief Pawan Kalyan Anantapur tour Today.జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు(మంగ‌ళ‌వారం) అనంత‌పురం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 9:52 AM IST
అనంత‌పురం జిల్లాలో నేడు పవ‌న్ ప‌ర్య‌ట‌న‌

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు(మంగ‌ళ‌వారం) అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మంగళవారం నుంచి 'కౌలు రైతు భరోసాయాత్ర'కు పవన్ శ్రీకారం చుట్ట‌నున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి ఒక్కో కుటుంబానికి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. ఏయే జిల్లాలో ఎంత మంది కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే వివ‌రాల‌ను జ‌న‌సేన యంత్రాంగం స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద సేక‌రించింది. కౌలు రైతుల‌ను ఆదుకునేందుకు ఇటీవ‌ల ప‌వ‌న్ రూ.5కోట్లు విరాళంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

పర్యటన షెడ్యూల్...

ఈ ఉద‌యం పుట్ట‌ప‌ర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న ప‌వ‌న్‌.. అక్క‌డి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి వెళ్ల‌నున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రౌతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేయ‌నున్నారు. కొత్తచెరువు గ్రామం నుంచి 10.30 గంటలకు బయల్దేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబానికి పరామర్శించి ఆర్థికసాయం అంద‌జేస్తారు. 11.20 గంటలకు ధర్మవరం నుంచి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి పయనం ఆ త‌రువాత అనంత‌పురం రూర‌ల్ మండ‌లం పూల‌కుంట‌, మ‌న్నీల గ్రామ‌ల‌ను చేరుకుంటారు. అన్ని ప్రాంతాల్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్నారు. అనంత‌రం మ‌న్నీల గ్రామంలో ర‌చ్చ‌బండ ను నిర్వ‌హించ‌నున్నారు. అక్క‌డ మ‌రికొంత మందరు కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించి వారి కుటుంబ ప‌రిస్థితులు తెలుసుకుంటారు. అనంత‌రం తిరిగి హైదరాబాద్ కు వెళ్ల‌నున్నారు.


Next Story