చంద్రబాబు విషయంలో కూడా అలా చేయడం చాలా తప్పు: పవన్ కళ్యాణ్
Janasena Cheif Pawan Kalyan Meet Chandrababu. జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు.
By Medi Samrat
జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం మొన్న కుప్పంలో జరిగిన సంఘటన అని అన్నారు. వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం దారుణం అని అన్నారు పవన్. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి నేడు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. ప్రజలకు వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలపై మాట్లాడనివ్వకుండా ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం తీసుకురావడం, ప్రత్యర్థి పార్టీలను అడ్డుకునేందుకు ఇలాంటి చెత్త జీవోలు తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఈ జీవో తీసుకురావడానికి ముందే తనను వైజాగ్ లో అడ్డుకున్నారని, వాహనంలోంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, గదిలోంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు విధించారని పవన్ తెలిపారు. తనకేకాదు, సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైందని అన్నారు. అందుకే ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చానని, భవిష్యత్తులో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకునేలా చేయడం కోసం ఏంచేయాలన్న దానిపై చంద్రబాబుతో మాట్లాడినట్టు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్ మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం.. వంటి అంశాల గురించి చర్చించుకున్నామని పవన్ అన్నారు.