ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చారా.? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ పరిస్థితి రాకుండా వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట రైతుల బలవన్మరణాల ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. పలనాడు, నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలపై జనసేన అధినేత సంతాపం వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతు కుటుంబాలకు జనసేన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ఈ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం త్రిసభ్య కమిటీ తక్షణమే స్పందించాలని, రైతు ఆత్మహత్యల నివారణకు వ్యవస్థలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వం ఎన్నికల సమయంలో రైతు కుటుంబానికి రూ.50 వేలు పంట పెట్టుబడికి హామీ ఇచ్చిందని, అది నెరవేర్చారా అని ప్రశ్నించారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, తర్వాతి పంటకు పెట్టుబడి పెట్టలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోయారు. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా జరుగుతున్న కౌలు రైతు ఆత్మహత్యల ఘటనల్లో ఒక్కొక్కరికి రూ.7 లక్షల పరిహారం కోసం పోరాడుతామని పవన్ కల్యాణ్ తెలిపారు.