ప్రధానికి స్వాగతం పలకనున్న జగన్
Jagan will welcome the Prime Minister. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ కు రానున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 3 July 2022 10:05 AM GMTప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ కు రానున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఉదయం 10:10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు.
ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు, కొద్దిమంది బీజేపీ నాయకులు పాల్గొంటారు. తర్వాత ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి భీమవరం చేరుకుంటారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో భేటీ కానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, సైన్యంలోని కీలక వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్లు మొత్తం 37 మందిని అధికారులు గుర్తించారు. వీరందరితో మోదీ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రధాని సభా వేదికపైకే వీరిని ఆహ్వానించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా దానిని విరమించుకుని ప్రధానితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. వేదికపై మోదీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉంటారు.