మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలకు దిగింది. ఆయనను వెంకటగిరి ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి సహకరించాలని జిల్లాలోని అన్ని విభాగాల అధిపతులకు సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలు సైతం అందాయి.
ప్రభుత్వ తీరుపై అధికార పక్ష ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం' అని ఆనం ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు వెంకటగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2024 వరకు నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికలకు, ఇప్పుడే నా సీటుకు ఎసరు పెడుతున్నారు. వెంకటగిరికి నేనే రేపు ఎమ్మెల్యే అని ఓ పెద్దమనిషి చెప్పుకుంటున్నాడు. వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా? కుర్చీ లాగేద్దామా అని.. కొంతమంది ఆశపడుతున్నారని కూడా ఆనం ఇంతకు ముందు వ్యాఖ్యలు చేశారు.