తెలంగాణపై మోదీకి సీఎం జగన్ ఫిర్యాదు.. మరోసారి
Jagan Complaints To Center Against Telangana. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ప్రధానమంత్రికి మరో లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్
By Medi Samrat Published on 7 July 2021 12:54 PM GMTతెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ప్రధానమంత్రికి మరో లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కృష్ణాజలాల్లో తెలంగాణ నీటి వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా.. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలిని కోరారు. వెంటనే ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ ఎఫ్ బలగాలు మోహరించాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి కల్పించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోందని జగన్ లేఖలో చెప్పుకొచ్చారు. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా.. జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందన్నారు.. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందని 14 పేజీలతో కూడా ఉత్తరాన్ని ప్రధానికి పంపించారు. తెలంగాణను అడ్డుకోవడంలో కృష్ణాబోర్డుతో పాటు అపెక్స్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు.
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ ప్రస్తావించారు. ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. తక్షణం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని లేఖలో జగన్ ప్రధానికి తెలిపారు. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుందని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసీ తెలంగాణ విద్యుత్ ను ఉత్పత్తి చేయటం దారుణమని.. జూన్ 1 తేదీ నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని లేఖలో ఆరోపణలు గుప్పించారు.