కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ శుక్రవారం ప్రకటించింది. రీజినల్ కనెక్టివిటీ పథకం (ఉడాన్)లో భాగంగా మార్చి 28 నుంచి ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో రీజినల్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని భావిస్తున్నామని ఇండిగో ప్రధాన స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్‌కుమార్ తెలిపారు. కొత్తగా ప్రారంభించే బెంగళూరు-కర్నూలు, విశాఖ-, కర్నూలు, చెన్నై-కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయని పేర్కొంది. ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి రీజినల్ కనెక్టివిటీ కోసం ఉడాన్ పథకం ప్రారంభించారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కేంద్రం 2017లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.