హై అలర్ట్.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్‌

పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు

By Medi Samrat  Published on  15 May 2024 8:00 AM GMT
హై అలర్ట్.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్‌

పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ అమలుకు ఆదేశించారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటుగా నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున బలగాలు గస్తీ కాస్తున్నాయి. తదుపరి ఆదేశాల వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు శాఖకు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ముగ్గురు వ్యక్తులకు మించి ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు.

Next Story