నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Heavy rains are likely to occur in Telugu states for two more days
By అంజి
తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నందున ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. బుధవారం నుంచి వర్షాలు తగ్గుతాయని చెబుతున్నారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసి అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. చిత్రావతి, స్వర్ణముఖి, పెన్నా తదితర నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు సహకరిస్తాయని అధికారులు తెలిపారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. కాగా, హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం తెల్లవారుజామున నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కోఠి, ఉప్పల్, నాగోల్‌లో చిరుజల్లులు కురిశాయి.