గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన హత్య కేసు నిందితుల్ని అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులని అరెస్టు చేశామని అన్నారు. తోట చంద్రయ్య బైక్ పై వెళ్తుండగా దాడి చేశారని పేర్కొన్నారు. కర్రలు, కత్తులతో చంద్రయ్యను హత్య చేశారని ఎస్పీ వెల్లడించారు. చంద్రయ్య కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నామని తెలిపారు. నాలుగు బృందాలతో గాలించి నిందితుల అరెస్టు చేశామని పేర్కొన్నారు.
చంద్రయ్య హత్య కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేశామని అన్నారు. ప్రధాన నిందితుడు చింతా శివరామయ్యకు చంద్రయ్యతో పాత గొడవలు ఉన్నాయని.. సిమెంట్ రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. తోట చంద్రయ్య తన హత్యకు కుట్ర చేస్తున్నారని శివరామయ్యకు సమాచారం ఉందని.. అందుకే తోట చంద్రయ్యను హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. చింతా శివరామయ్య ప్రస్తుతం వెల్దుర్తి ఎంపిపిగా ఉన్నారని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలేది లేదని ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు.