ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన ఆయన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ నియమాక పత్రాన్ని అందించారు. కాకినాడ జిల్లా జి.మామిడాలలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అపర్ణకు ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆయన సోదరుడు నవీన్‌కు ఒప్పంద ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అపర్ణకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు.
మామిడాడలోని జగనన్న కాలనీలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లికి చెరో సెంటున్నర ఇంటి స్థలం కేటాయిస్తూ పట్టాలు అందించారు. ఆ స్థలంలో ప్రభుత్వమే ఇళ్లు కట్టి ఇస్తుందని విక్టర్ ప్రసాద్ చెప్పారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇప్పటికే ప్రభుత్వం తరపున రూ. 8.25 లక్షలు మంజూరైనట్టు చెప్పారు.
నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.