తిరుమల ఘటనపై గోరంట్ల ఫైర్
Gorantla Butchiah Choudary Comments On Tirumala Incident. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఆంక్షలు దాదాపుగా ఎత్తివేయడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు
By Medi Samrat
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఆంక్షలు దాదాపుగా ఎత్తివేయడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాలు(గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్) వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో నేడు మళ్లీ సర్వదర్శనం టికెన్ల కౌంటర్ తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ముగ్గురు భక్తులు గాయపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఇది దుస్థితి.. తిరుమల లో దర్శన భాగ్యం కూడా ఈ నిచమైన ప్రభుత్వం కల్పించలేక పోతుంది. వేసవి దృష్ట్యా కనీస చర్యలు కూడా టిటిడి చేపట్టలేకపోతుంది. హృదయ విధారక చర్యలు చూస్తున్నాం' అని ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ విమర్శలు చేశారు.