ఖరీఫ్ సీజన్‌లో రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ బ్యాంకులు జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు బ్యాంకులు రూ.985 కోట్ల రుణాల్ని మంజూరు చేశాయని.. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.49,831 కోట్ల రుణం మంజూరు చేసినట్లు వెల్లడించారు. విద్యారంగానికి రూ.252 కోట్లు, హౌసింగ్ కు రూ.1,146 కోట్లు, పునరుద్పాదక ఇంధన రంగానికి రూ.125 కోట్ల మేర బ్యాంకర్లు రుణ మంజూరు చేయగా.. స్వయం సహాయ సంఘాలకు రూ.5,937 కోట్ల రుణాన్ని, ముద్రా రుణాల కింద రూ.3189 కోట్లు బ్యాంకులు మంజూరు చేసినట్లు వివరించారు.
అమరావతి- రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్ హెచ్ జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ బీసీ సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని బ్యాంకర్లకు సూచించారు. రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఇండికేటర్లు కూడా రోటీన్ గా మారుతున్నాయన్నారు. ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉంది. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లూ తమ తీరు మార్చుకోవాల్సి ఉందని సూచించారు.