రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ. 5,000 ప్రకారం గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.
ఇప్పటికే గత నెలలో రాష్ట్రంలోని ఇమాములు, మౌజాన్లకు 6నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ను పూర్తి చేసి రూ. 45 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందని మంత్రి విమర్శించారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.