‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్దత

‘ఆపరేషన్ సిందూర్’ అనంతర సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు.

By Medi Samrat
Published on : 7 May 2025 8:49 PM IST

‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్దత

‘ఆపరేషన్ సిందూర్’ అనంతర సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సమీక్షకు సిఎస్, డీజీపీలతో పాటు టూరిజం, ఎండోమెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్, ఆర్ అండ్ బి తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్, సిఐఎస్ఎఫ్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు, సన్నద్దతపైనా... అలాగే మాక్ డ్రిల్స్ నిర్వహణ, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడంపైనా చర్చించారు. ఊహించని ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమీక్షలో ఆయా విభాగాలు తమ సన్నద్దతను సమావేశంలో వివరించాయి.

అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలి. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధతపై పలు సూచనలు చేసింది. వాటిని పూర్తిగా అమలు చేయాలి. ఇలాంటి సమయంలో అన్ని శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలి. ప్రజలు ఆందోళన చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలి. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీటీడీ వంటి చోట్ల ప్రత్యేక రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. 24 గంటలు అన్ని శాఖల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్ర సంస్థలకు అవసరమైన అన్నిరకాల సహకారం అందిస్తామని... ఏ సమయంలో అయినా తమను సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story