ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో హామీని అమలు చేయబోతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి 'స్త్రీ శక్తి' అని పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే నమూనా టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రణ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కాగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ కోసం ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్టీసీ సిబ్బంది వినియోగించే టిమ్స్ యంత్రాలు, యూటీఎస్ సాఫ్ట్ వేర్‌లో మార్పులు చేసింది. జీరో ఫేర్ టికెట్లు ఎలా జారీ చేయాలో తెలుపుతూ నేటి నుంచి సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. అన్ని బస్ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి శిక్షణ ఆర్టీసీ ఇవ్వనుంది. మహిళలకు ఇచ్చే టికెట్‌పై ఛార్జీ , ఇచ్చిన రాయితీ వివరాలు ఆర్టీసీ ముద్రించనుంది. జీరో ఫేర్ టికెట్లు వేగంగా జారీ అయ్యేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసింది.