ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. 2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు కర్నూలు జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్నూల్ జిల్లాలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.
అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా చేపడుతామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. రైతులకు కూడా కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు జతచేసి మొత్తం రూ.14 వేలు అకౌంట్లలో వేస్తామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ గా అభివృద్ధి చేస్తామన్నారు.
మహిళల సామాజిక, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారని అధికారులు చెబుతున్నారు.