ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది. అన్ని బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదిక ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో పాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారాయణ, నారా లోకేశ్ హాజరుకానున్నారు.
కాగా ఇప్పటికే వివిధ బ్యాంకులకు సీఆర్డీఏ భూ కేటాయింపులు చేసింది. ఈ సందర్భంగా బ్యాంకులు, అధికారుల నివాస భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అయితే ఇప్పటివరకు రాజధానిలో ఏపీ ప్రభుత్వం భవనాల నిర్మాణం చేపట్టగా..ఇప్పుడు అన్ని ప్రధాన బ్యాంకుల కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కానుంది. దీంతో అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.