మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్లు జైలు శిక్ష

Former MP Kothapally Geetha couple sentenced to five years in jail. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నమోదు చేసిన సెక్యూరిటీ మోసం కేసులో సీబీఐ

By అంజి  Published on  14 Sep 2022 10:30 AM GMT
మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్లు జైలు శిక్ష

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నమోదు చేసిన సెక్యూరిటీ మోసం కేసులో సీబీఐ బుధవారం ఆమెను అరెస్టు చేసింది. కొత్తపల్లి గీత భర్త పీఆర్‌కే రావు.. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రూ.50 కోట్ల రుణం తీసుకున్నారని పీఎన్‌బీ పేర్కొంది. ఈ రుణానికి అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న గీత గ్యారెంటర్‌గా ఉన్నారు. లోన్‌ తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పీఎన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీత, పీఆర్‌కే రావులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

2015 జూన్ 11న ఈ కేసు నమోదు అయింది. అప్పట్లో ఈ కేసు కారణంగానే రాజకీయంగా కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. సీబీఐ అధికారులు గీతను వైద్య పరీక్షల నిమిత్తం.. హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. గీతతో పాటు ఆమె భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాష్‌, కేకే అరవిందాక్షన్‌కు కూడా ఐదేళ్లు జైలు శిక్ష పడింది.

విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కోర్టు రూ.2 లక్షల జరిమానా విధించింది. మరోవైపు ఆమె లాయర్లు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ నుండి వెళ్లిపోయిన తర్వాత, ఆమె 2018లో జన జాగృతి పార్టీ అనే కొత్త రాజకీయ సంస్థను ప్రారంభించింది. తర్వాత, గీత తన పార్టీని బీజేపీలో విలీనం చేసింది. మల్లిఖార్జున హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాలాక్షి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోస్టల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, కనక ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్, మహేశ్వర ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాలాక్షి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, అన్విత హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కొతపల్లి గీత డైరెక్టర్‌గా ఉన్నారు.

Next Story