జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు (అంజిబాబు) పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
By Medi Samrat Published on 12 March 2024 7:30 PM ISTభీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు (అంజిబాబు) పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పులపర్తి ఆంజనేయులుకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని పులపర్తి ఆంజనేయులు వెల్లడించారు. సమాజం బాగుండాలన్న ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేశారని.. ఏపీలో ఎన్నికల వేళ మూడు పార్టీల కలయిక కోసం పవన్ తీవ్రంగా కృషి చేశారని అన్నారు.
పులపర్తి ఆంజనేయులుని పార్టీలో చేర్చుకోవడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏ పార్టీలోకి అయినా సమాజంలో గొడవలు తగ్గించేవాడు రావాలి కానీ, గొడవలు పెంచేవాడు రాకూడదని అన్నారు. పులపర్తి ఆంజనేయులు గొడవ తగ్గించే వ్యక్తి. నిబద్ధతతో నిలబడే వ్యక్తి.. ఇలాంటి వాళ్లు జనసేన వెంట, నా వెంట ఉండాలన్నారు. గత కొన్నేళ్లుగా ఆయనను చూస్తున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడని, మనవాడని అందరూ వెనకేసుకొస్తే అతడు ఎన్నో దుర్మార్గపు పనులను చేస్తున్నారని అన్నారు. భీమవరం కుబేరులు నివసించే నగరం. కానీ ఇప్పుడా నగరం ఒక వీధి రౌడీ కబంధ హస్తాల్లో చిక్కుకుందన్నారు. జగన్ ను రాష్ట్రం నుంచి, గ్రంథి శ్రీనివాస్ ను భీమవరం నుంచి తరిమేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.