ఏపీలో తొలి ఓమిక్రాన్‌ కేసు నమోదు.. ప్రజల్లో భయాందోళన

First omicron case in vizianagaram district..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓమిక్రాన్‌ కలకలం రేపుతోంది. తాజాగా ఏపీలో తొలి ఓమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

By అంజి  Published on  12 Dec 2021 11:54 AM IST
ఏపీలో తొలి ఓమిక్రాన్‌ కేసు నమోదు.. ప్రజల్లో భయాందోళన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓమిక్రాన్‌ కలకలం రేపుతోంది. తాజాగా ఏపీలో తొలి ఓమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు తెలిపింది. విజయనగరానికి చెందిన వ్యక్తి మొదట ఐర్లాండ్‌ నుండి ముంబైకి వచ్చాడు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా.. అతడికి నెగెటివ్‌ వచ్చింది. ఆ తర్వాత అతడు ముంబై నుండి విశాఖపట్నం వచ్చాడు. విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్‌ కరోనా టెస్ట్‌లు చేశారు. అనంతరం అతడి నమూనాలను సీసీఎంబీకి పంపించారు. ఈ పరీక్షల్లో అతడికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందని తేలింది. ఈ విషయం తెలియడంతో స్థానిక ప్రజల్లో భయాందోళన వాతావరణ నెలకొంది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిసింది. కాగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.

ఇక నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 31,131 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 156 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,708కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,465గా ఉంది. 24 గంటల వ్యవధిలో 188 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 2058289కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,954 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,07,46,537 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story