ఇల్లు మునగడంతోనే సీఎం అక్కడ ఉంటున్నారు : మాజీ మంత్రి కాకాణి

బుడమేరు వరద విషయంలో టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు

By Medi Samrat  Published on  9 Sep 2024 12:00 PM GMT
ఇల్లు మునగడంతోనే సీఎం అక్కడ ఉంటున్నారు : మాజీ మంత్రి కాకాణి

బుడమేరు వరద విషయంలో టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగిందని.. అందుకే ఆయన తన ఇంటికి పోవడం లేదని, వరదలు తగ్గిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెపుతున్నారన్నారు. జగన్ మోకాలు లోతు నీళ్లలోకి దిగిన తర్వాతే చంద్రబాబు నీళ్లలోకి దిగారని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి మాట్లాడే చంద్రబాబు వరద తీవ్రతను ఎందుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నించారు.

బుడమేరుకు 1964లోనే వరద వచ్చిందని, అప్పుడు 10 మంది చనిపోయారని అన్నారు. భారీ వరద వచ్చే అవకాశం ఉందని, నీటిని విడుదల చేయాలని అధికారులు చెపుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వరద నివారణ చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు ఎందుకు తరలించలేదని కాకాణి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రేషన్ వాహనాలనే ఇప్పుడు ప్రభుత్వం వాడుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీని వైసీపీ నేతలకు చెందిన బోట్లు ఢీకొన్నాయని ప్రచారం చేస్తున్నారని, రైల్వే ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే... చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం అని ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

Next Story