ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు.. ఈ కామర్స్‌లో ఆప్కో అమ్మకాల జోరు

సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైంది.

By Medi Samrat
Published on : 3 Sept 2025 5:43 PM IST

ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు.. ఈ కామర్స్‌లో ఆప్కో అమ్మకాల జోరు

సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైంది. నేతన్నల అభివృద్ధికి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ ప్రభుత్వం సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోంది. అదే సమయంలో ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా అమ్మకాలు ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్ లను సిద్ధం చేసింది. నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యువత, మహిళ, చిన్న పిల్లలు... ఇలా వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దుస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచింది.

చేనేత వస్త్రాల డోర్ డెలివరీ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ కామర్స్ దే హవా. ఇంటి దగ్గర నుంచే ఇంటికి, తమకు అసవరమైన వస్తువులు, సరకులను ఈ కామర్స్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసుకుంటున్నారు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, నేతన్నలు నిలదొక్కుకోడానికి ఈ కామర్స్ లోకి రాష్ట్ర ప్రభుత్వం అడుగుపెట్టింది. చీరలు, దోతీలతో పాటు రెడీమేడ్ చేనేత వస్త్రాలను ఈ కామర్స్ లో లభించేలా విక్రయాలు ప్రారంభించింది. నేరుగా ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను రూపొందించింది. చాలా తక్కువ కాలంలోనే ఆన్ లైన్ ద్వారా రూ.45 లక్షల విలువైన చేనేత వస్త్రాలు అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలను మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల లభ్యతపై విశేష ప్రచారం ప్రారంభించింది.

ఈ కామర్స్ కు 40 ఆప్కో షో రూమ్ ల అనుసంధానం

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆప్కో ద్వారా చేనేత అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్టంతో పాటు దేశ వ్యాప్తంగా 92 ఆప్కో షో రూమ్ లున్నాయి. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పుట్టపర్తి, ప్రొద్దుటూరు, టెక్కలి, ఎమ్మగనూరు, అనకాపల్లిలో అయిదు షో రూమ్ లను ప్రారంభించింది. చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి అనుగుణంగా 40 ఆప్కో షో రూమ్ ల ద్వారా ఆన్ లైన్ లో చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రారంభించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఈ 40 ఆప్కో షో రూమ్ లను అనుసంధానం చేసింది.

నూతన డిజైన్లతో చేనేత రెడీమేడ్ దుస్తులు

చేనేత అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చీరలు, తువాళ్లు, లుంగీలు, దుప్పుట్లు, షర్ట్ బిట్లు. ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా, అన్ని వర్గాల వారికి నచ్చేలా నూతన డిజైన్లతో రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేసి, అమ్మకానికి పెట్టింది. ఇందుకోసం పలువురు డిజైనర్లను సైతం ప్రభుత్వం నియమించింది. వధూ వరులకు అవసరమైన దోతీలు, మోడి జాకట్లు, చీరలు, షర్టులు, లెనిన్ షర్ట్ లతో పాటు నేటి యువతను ఆకట్టుకునేలా కుర్తాలు, షార్ట్ కుర్తాలను సైతం అమ్మకాలు చేస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా సరిపడేలా గౌన్లు, ఇతర దుస్తులను కూడా కొత్త కొత్త డిజైన్లతో సిద్ధం చేసి విక్రయాలు చేస్తోంది. కలంకారీ చీరలు, పెన్ కలంకారీ చీరలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, ఎంబ్రాయిడింగ్ చీరలను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల లభిస్తుండడంతో, విక్రయాలు ఘణనీయంగా పెరిగాయి. దీంతో చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెరిగి, నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తోంది.

నేతన్నకు 365 రోజుల ఉపాధే లక్ష్యం

నేతన్నలు గౌరవప్రదమైన జీవనం సాగించడంతో 365 రోజులూ వారికి ఉపాధి కల్పించాలన్నది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే...మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పనతో చేనేత రంగంలో ఉత్సాహం నెలకొంది. చేనేత ఉత్పత్తుల విక్రయాల పెంపుదలకు కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్ తో ఒప్పందాలు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ కామర్స్ లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా ఆన్ లైన్ లో చేనేత దుస్తుల అమ్మకాలను ప్రారంభించాం. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేయించి, ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ అమ్మకాలు చేస్తున్నాం. నేతన్నలకు రెడీమేడ్ దుస్తుల కోసం అవసరమైన మెటీరియల్ తయారీపై శిక్షణ సైతం అందజేస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత అమ్మకాలు ఊపందుకున్నాయి.

Next Story