పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన‌ డీజీపీ

ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు.

By Medi Samrat  Published on  5 Nov 2024 9:27 AM GMT
పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన‌ డీజీపీ

ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని.. అప్పట్లో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టామని తెలిపారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన ప్రొబిషన్‌ డీఎస్పీ పాసింగ్‌ పరేడ్‌లో హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి డీజీపీ పాల్గొన్నారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీలకు పలు సూచనలు చేశారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణే తమ విధానం అని డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళల్లో పనిచేయమని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కామెంట్‌ చేయనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా సరిగ్గా విధులు నిర్వహించలేదని తెలిపారు. ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పటికీ బాధ్యతగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్టు చేయలేదని చెప్పారు. ఈ ఘటనపై మూడేళ్ల తర్వాత చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించడం సరికాదని అన్నారు. తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాత అయినా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. కేరళలో తప్పు జరిగిన 20 ఏళ్ల తర్వాత ఓ ఐపీఎస్‌కు శిక్ష విధించారని తెలిపారు. న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫింగర్‌ ప్రింట్‌ టెక్నాలజీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో వినియోగించలేదని ఏపీ డీజీపీ తెలిపారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని డీజీపీ తెలిపారు. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా పోలీసు వ్యవస్థలో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఐజీ సంజయ్‌పై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరుగుతోందని అన్నారు. ఆయనపై విచారణ నివేదిక జీఏడీకి వెళ్లిన తర్వాత తమకు వస్తుందని తెలిపారు.

Next Story