ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇందులో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు. గత ప్రభుత్వానికి దేవుడిపై, హిందూ సంప్రదాయాలపై పగ ఉందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని పవన్ ఆరోపించారు. వీరికి ఏడుకొండల స్వామిపై ఎందుకో పగ.. ఏడు కొండలు ఎందుకు, రెండు చాలు అన్న చరిత్ర వీరిది.. వీరు వ్యక్తులపై, ప్రత్యర్థులపై కాదు, ఏకంగా భగవంతుడిపైనే పగబట్టారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారి వారసత్వం, వారి పరంపర ఎలాంటిదో ప్రజలు గమనించాలి. అందుకే ఈ అంశాన్ని సరిదిద్ది, వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇలాంటి పాత విషయాలపై ఆరోపణలు, విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం మాకేముంటుంది? మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ విషయాలను ప్రస్తావిస్తున్నామన్నారు. ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను, భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు. చరిత్రలో అలా బతికి బట్ట కట్టిన దాఖలాలు కూడా లేవని పవన్ కళ్యాణ్ అన్నారు.