అమరావతి రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ రంగు పులుముకున్న యాత్రకే మేము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్ర.. అదో రియల్ ఎస్టేట్ యాత్ర.. భ్రమరావతి యాత్ర అని ధర్మాన వ్యాఖ్యానించారు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనని అన్నారు. అమరావతి భూములకు బినామీ చంద్రబాబేనని, ఈ ఉద్యమానికి బినామీ కూడా ఆయనేనని విమర్శించారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ టీడీపీ నాయకులు, శ్రేణులే ఉన్నారని.. ఈ యాత్ర చేయిస్తున్నది నేనే అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఒక ఆన్యాయం నుంచి మరిన్ని అన్యాయాలకు దారి తీయాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలకు మారు పేరుగా ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. 13 జిల్లాలు, మిగతా ప్రాంతాలు, మిగతా సామాజిక వర్గాల వారిని కవ్విస్తూ యాత్ర సాగిస్తున్నారని విమర్శించారు.
ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టే లు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాల మీద దండయాత్ర కాదా? అని నిలదీశారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్దికి మా నాయకుడు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని.. మేనిఫెస్టోలో ఆయన ఏం చేస్తామని చెప్పారో.. దాన్ని దైవంగా భావించి చేసి చూపిస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన తెలిపారు.