బద్వేలు ఉపఎన్నికలో లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తెలిపారు. బద్వేలులో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కారకులై, విభజన హామీలను నెరవేర్చకుండా, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కారణమైన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని అన్నారు. రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రెండు పార్టీలే కారణం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే, ఆ విభజనకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ కూడా సహకరించిందని విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. బీజేపీ అధికారంలోకి వస్తే అయిదేళ్లు కాదు, పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ వెంకన్న సాక్షిగా ప్రజలుకు హామీ ఇచ్చి.. మాట తప్పారని అన్నారు.
రాయలసీమ ప్రాంతంపైన ఏమాత్రం అవగాహన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అనేక ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నిధులను ఇప్పించి, ఆ తర్వాత బీజేపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చేటప్పుడు మాత్రమే ఆలోచిస్తారుగానీ, మాట ఇచ్చిన తర్వాత వెనుదిరిగే ప్రసక్తే ఉండదని, ఈ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా స్పష్టం చేశారు.