నేను పని చేస్తా.. పని చేయిస్తా : డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్

‘దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అయినా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం.

By Medi Samrat  Published on  20 Dec 2024 7:56 PM IST
నేను పని చేస్తా.. పని చేయిస్తా : డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్

‘దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అయినా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం. గిరిజనుల ప్రాణాలన్నా, వారి సంక్షేమమన్నా గత పాలకులకు ఎందుకో నిర్లక్ష్యం ఆవహించింది. గత ఐదేళ్ల పాలనలో గిరిజన అభివృద్ధికి దృష్టి పెట్టింది లేదు. రుషికొండ ప్యాలస్ ను రూ. 500 కోట్లతో నిర్మించడం, వెనకబడిన జిల్లాలకు చెందాల్సిన నిధులను పక్కదారి పట్టించడం తప్పితే ఇక్కడ అభివృద్ధిని గత పాలకులు పూర్తిగా విస్మరించార’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం వంటి అంశాలు పట్టిపీడుస్తున్నాయన్నారు. ప్రజలకు ఎంతో బాధ్యతగా కొత్త మార్పు కోసం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా పర్యటించి క్షేత్రస్థాయి పర్యటన చేసి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం బాగుజోల నుంచి సిరివర గ్రామం వరకు రూ. 9 కోట్లతో తారు రోడ్డు నిర్మించే పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించబోయే రోడ్లకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశం నుంచి సిరివర వెళ్ళే కొండప్రాంతం మీదకు ఉన్న కచ్చా రోడ్డును పరిశీలించేందుకు కాలినడకన వెళ్లారు. స్వయంగా గిరిజన నివాస ప్రాంతాలకు వెళ్ళి వారితో మాట్లాడారు. అనంతరం బాగుజోలకు వచ్చి గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మనసుంటే మార్గం ఉంటుంది. అడవి, కొండలను నమ్ముకొని జీవించే గిరిపుత్రుల కష్టాలు తీర్చాలనే ఆలోచన ఉంటే కచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏనాడు గిరిజనుల అభ్యున్నతి, అభివృద్ధిపై దృష్టి పెట్టింది లేదు. విశాఖపట్నంలో విలువైన ఆస్తులను తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఆ సొమ్ములు మళ్లించారు. రుషికొండ ప్యాలస్ కు విలువైన ప్రజాధనం వెచ్చింది వృథా చేశారు. గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదు. రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన గ్రామాలకు సంబంధించి తీసుకొచ్చిన రూ. 690 కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. ఏనాడు గిరిజన ప్రాంతాల్లో ఒక్కసారి కూడా గత పాలకులు సందర్శించిందే లేదు. గిరిజనుల బతుకులు, వారి వెతలు తెలుసుకున్నదే లేదు. నేను వెంటనే అద్భుతాలు చేస్తానని చెప్పటం లేదు. ఒక సంవత్సరం సమయం నాకు ఇవ్వండి. గిరిజన ప్రాంతాల్లో మార్పు అనేది కచ్చితంగా చూపిస్తాను. మేము పాలన ప్రారంభించిన ఆరు నెలలకే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. గిరిజన ప్రజల కోసం ఎండనకా.. వాననాకా పనిచేస్తానని మాటిస్తున్నానన్నారు.

నేటి యువతే రేపటి భవిష్యత్తు. యువత ప్రతి అంశంలోనూ నైపుణ్యం పెంచుకోవాలి. ఇక్కడి ప్రకృతి రమణీయత చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే యువతకు బోలేడు ఉపాధి కలుగుతుంది. పర్యాటకులు, ప్రకృతిపై అధ్యయనం చేసేవారు ఇటుగా వస్తే గిరిజనుల జీవన శైలి మెరుగవుతుంది. టూరిజం ద్వారా జీవన స్థితిగతులు మెరుగవుతాయి. దీనికోసం ఆలోచన చేస్తాం. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని జీవనోపాధి కేంద్రంగా తయారు చేస్తాం. నేను మాటలు చెప్పే మనిషిని కాదు. దీనిపై ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పకడ్బందీగా ముందుకు వెళ్లే ఆలోచన చేస్తాం. ఇక్కడి వనరులు, వ్యవసాయ ఫలాలు స్థానికులకు దక్కేలా ప్రయత్నం చేస్తాం. హోంస్టే ఏర్పాట్లతోపాటు ప్రకృతిని ఆస్వాదించే టూరిజానికి ప్రోత్సాహం అందించడం ద్వారా మరింత ముందుకు వెళ్లొచ్చన్నారు.

అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజా ఖజానా నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయలు సద్వినియోగం అవ్వాలి. వేస్తున్న రోడ్లు, కడుతున్న భవనాలు ఏదైనా సరే నాణ్యత లోపాలతో ఉంటే కచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రస్తుతం వేస్తున్న రోడ్ల నాణ్యత విషయంలో యువత పరిశీలన అనేది అవసరం. వారు నిరంతరం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ పనుల నాణ్యత విషయంలో దృష్టి పెట్టాలి. ఉత్తరాంధ్ర దోపిడీలకు ఎదురు తిరిగిన నేల. తెలుగు వాడుక భాషకు శ్రీకారం చుట్టిన నేల. మీరు నాకు పూర్తిస్థాయిలో సహకరించండి. అందరం కలసి సమష్టిగా మార్పు కోసం ప్రయత్నిద్ధాం. మీ కోసం పనిచేసే వాడు ఒకడు కావాలి. అది నేనే అవుతాన‌న్నారు.

ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం విషయంలో చర్చించాం. వెంటనే ఆయన ఆమోదించి, రోడ్లు నిర్మాణానికి అంగీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం సంపూర్ణంగా పని చేస్తుంది. ఇప్పుడు కూడా నేను కొండ ప్రాంతాల్లో, బురద రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లడానికి కారణం ఏంటంటే.. గిరిజనుల వెతలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని వెళ్లాను. డోలీ భుజంపై పెట్టుకొని అంతదూరం నడిచి వెళ్తుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకొనేందుకు నడిచి వెళ్లాను. ప్రజల బాధలు, వెతలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాము. మూడు విడతల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేసేలా ముందుకు వెళ్తున్నాం. 2019లో మీరు నన్ను పరీక్షించారు. నేను నిలబడే ఉన్నాను. కచ్చితంగా ప్రజల కోసం ఎంత కష్టమైనా నిలబడే ఉంటాను. నేను పని చేస్తా.. పని చేయిస్తా’’ అన్నారు.

Next Story