పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు కోసం పాకులాడుతున్నారు : సీపీఎం మధు
CPM Madhu Comments On Pawan Kalyan. పాచిపోయిన లడ్డు కోసం పవన్ కళ్యాణ్ పాకులాడుతున్నారని సీపీఎం నాయకుడు మధు తీవ్ర విమర్శ చేశారు
By Medi Samrat Published on 15 March 2022 8:05 PM IST
పాచిపోయిన లడ్డు కోసం పవన్ కళ్యాణ్ పాకులాడుతున్నారని సీపీఎం నాయకుడు మధు తీవ్ర విమర్శ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో అమరావతి ప్రజా బాటను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన బీజేపీకి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకవద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ నాడు బీజేపీ పార్టీని పాచిపోయిన లడ్డూ అని వ్యాఖ్యానించి.. నేడు అదే పాచిపోయిన లడ్డు కోసం ప్రాకులాడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీపై పోరాటం సరైనది అయినప్పటికీ.. బిజెపితో రోడ్ మ్యాప్ కోసం చూడం సరికాదని అన్నారు. ఇది పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లడమే అవుతుందని విమర్శనాస్త్రాలు సంధించారు. హైకోర్టు తీర్పుని రాష్ట్రప్రభుత్వం గౌరవించాలని.. రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను అభివృద్ధి పరిచి అందించాలని అన్నారు. రాజధాని అభివృద్ధికి సరైన ప్రణాళికలు రూపొందించాలని.. రాజధాని విషయంలో వివాదానికి కారణమైన ద్వంద విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించాలని అన్నారు.
రాజధాని పేదలకిచ్చే పెన్షన్ రూ. 2500 నుండి 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అన్నింటిని వెంటనే చెల్లించాలని.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సూత్రబద్ధమైన పోరాటం ఉండాలి తప్ప.. బీజేపీతో మిలాకత్ కోసం పవన్ కళ్యాణ్ ఆలోచన ఉండరాదని సూచించారు. శాంతియుతమైన పోరాటాలు నిర్వహిస్తున్న అంగన్వాడీలు, ఆశాలు, ఇతర రంగాల కార్మికులపై పోలీసుల నిర్బంధ కాండను మధు ఖండించారు.