సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఎం నేతలు కలిశారు.
By Medi Samrat Published on 25 July 2024 9:00 PM ISTముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఎం నేతలు కలిశారు. సచివాలయంలో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి సీఎంను కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం, పెన్షన్లు రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంపు, త్వరలో అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించాలని సీఎంను కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం.. పరిహారం ఇవ్వాలని కోరారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయడంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలన్నారు.